రాజధానిపై వైసీపీ స్టాండ్ మార్చిందా? సజ్జల మాటల్లో ఆంతర్యం ఏంటి?

2014 లో ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతరం విభజిత రాష్ట్రానికి రాజధాని అంశం కీలకంగా మారింది. 2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఈ అంశంమీదే ప్రధానంగా దృష్టి సారించారు. అనేక కమిటీల సిఫార్సుల తర్వాత వెలగపూడి-తాడేపల్లి కేంద్రంగా అమరావతిని రాజధానిగా ప్రకటించింది బాబు సర్కార్.

Read Also : India vs Pak : ఇండియా పాక్ మ్యాచ్ కు ఇంకా అమ్ముడుపోని టికెట్లు కారణం ఇదేనా?

3 వేల పైచిలుకు ఎకరాల భూ సేకరణ, తాత్కాలిక సచివాలయం, హై కోర్టు వంటి నిర్మాణాలు జరిగాయి. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల అంచనా వ్యయాన్ని వేసింది అప్పటి ప్రభుత్వం. తర్వాత మారిన పరిస్తులతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. జగన్ అధికారంలోకి రాగానే రాజధాని అభివృద్ధి చెందిన నగరంలో ఉండాలి తప్ప నగరాన్ని నిర్మించడం సరైనది కాదని, లక్షల కోట్ల మూలధనాన్ని వృధా చేయకూడదని భావించారు. దానితో మూడు రాజధానుల రాగాన్ని అందుకున్నారు.

See Also : Ritu Varma Latest pics

కంటి తుడుపగా అమరావతి, కర్నూలులో శాసన, స్యాయ రాజధానులున్నా విశాఖ నుండే పరిపాలన సాగించాలని జగన్ అనుకున్నారన్నది కాదనలేని వాస్తవం. కానీ ఆ ప్రయోగం కోర్టు కేసులతో, ఇతర రాజకీయ కారణాలతో సక్సెస్ కాలేదు. 2024 ఎన్నికల్లో కూటమి హవా కొనసాగడంతో మళ్ళీ అమరావతి వాదానికి జవసత్వాలు వచ్చాయి. రాజధాని నిర్మాణానికి కేంద్రం సైతం అప్పులిప్పిస్తుండడంతో ఈ వ్యవహారం ఊపందుకుంది.

See Also : Little Hearts Beauty : శివాని నగరం క్యూట్ లుక్స్

ఈ పరిణామాలతో రాజధానిపై కూటమి ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి పెరిగిపోతుండడంతో అమరావతిని కాదనలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం మారితే వైసీపీ అమరావతిని నాశనం చేస్తుందన్న టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు సజ్జల రామ కృష్ణారెడ్డి. ఓ ప్రయివేటు మీడియా సంస్థ విజయవాడలో నిర్వహించిన కాంక్లేవ్ లో పాల్గొన్న ఆయన అమరావతికి మేము వ్యతిరేకం కాదని, అలాగైతే జగన్ అసలు తదేపల్లిలో ఇల్లు ఎందుకు కట్టుకునేవారో చెప్పాలని వ్యాఖ్యానించారు.

వైసీపీ కేవలం అమరావతికి భారీగా అయ్యే ఖర్చుకు మాత్రమే వ్యతిరేకమని, ఈ ప్రాంతానికి కాదని చెప్పుకొచ్చారు. ఐకానిక్ టవర్లకు డబ్బు పెట్టకుండా విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని నిర్మాణం చేస్తే నగరం త్వరిత గతిన అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీ సైతం అమరావతికి జై కొట్టిందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. ఒకవేళ 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చినా విజయవాడ గుంటూరు వైపు రాజధాని కొంతవరకూ మరలుతుందే తప్ప పూర్తిగా అమరావతికి అన్యాయం జరగదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏదేమైనా ఆయా పార్టీల రాజకీయ క్రీడలతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సరైన రాజధాని లేక విలవిల్లాడుతోందనేది కాదనలేని వాస్తవం.