కశ్మీర్ రాష్ట్రంలోని ప్రధాన టూరిజం కేంద్రమైన పహల్గామ్‌లో జరిగిన పాశవిక ఉగ్రవాద దాడి వెనుక ఉన్న దేశ ద్రోహుల కుట్ర నెమ్మదిగా బయటకొస్తోంది. ఉగ్రవాదులతో నాలుగు మార్లు సమావేశమై, వారికి లాజిస్టిక్స్ తో పాటు, ఓ మొబైల్ ఫోన్ ఛార్జర్ ను కూడా అందించిన వ్యక్తిని NIA అధికారులు ఇటీవల అరెస్టు చేశారు.
నిందితుడి పేరు మొహమ్మద్ యూసుఫ్ కటారి. అతని వయసు 26. అతనో టీచర్. కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు ఆసిఫ్, జిబ్రాన్, హంజా ఆఫ్ఘనీలను ఇతను నాలుగుసార్లు కలిసాడు. అలాగే వారికి ఓ ఆండ్రాయిడ్ మొబైల్ కు సంబందించిన ఛార్జర్ ను కూడా అందించాడు. ఆ ఛార్జరే ఆఖరికి అతన్ని పట్టించింది.
Read Also : BREAKING : తెలంగాణ స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు
జూలైలో ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా శ్రీనగర్ శివార్లలో పెహల్గాం దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చాయి. సంఘటనా స్థలంలో వారు స్వాధీనం చేసుకున్న వస్తువులలో పాక్షికంగా పాడైపోయిన ఓ ఛార్జర్ కూడా వారికి దొరికింది. ఆ ఛార్జర్ సీరియల్ నంబర్, కనెక్టివిటీ డేటాను ఫోరెన్సిక్ ల్యాబ్ లో గుర్తించారు. దీంతో శ్రీనగర్ పోలీసులు ఛార్జర్ అసలు యజమానిని కనుగొన్నారు. అతను దానిని ఒక డీలర్‌కు విక్రయించినట్లు తెలపడంతో. డీలర్ నుంచి కొనుగోలు చేసిన మొహమ్మద్ యూసుఫ్ కటారి వరకూ పోలీసులు చేరుకున్నారు. మొత్తానికి ఓ మొబైల్ చార్జర్ ఓ దేశ ద్రోహిని పట్టించిందన్నమాట!
